ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటనలో ట్రాఫిక్ జామ్ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ శారదా పీఠం సందర్శనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం పర్యటన సందర్భంగా అధికారులు నగరంలో గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే విచారణ జరిపించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిచిపోయిందని అధికారులను ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అధికారులపై సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని స్పష్టం చేశారు.
సీఎం జగన్ పర్యటన సందర్భంగా శారదా పీఠం నుంచి విమానాశ్రయానికి వెళ్లే సీఎం కాన్వాయ్ వరకు వాహనాలను అనుమతించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎన్‌ఏడీ జంక్షన్‌లో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొత్తవలస నుంచి వచ్చే వాహనాలను పోలీసులు రెండు గంటల పాటు నిలిపివేశారు. మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పీఠం వద్ద సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన రాజశ్యామల యాగం, రుద్ర హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.