'వచ్చేది వైసీపీ ప్రభుత్వమే'.. వైఎస్‌ జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని మండిపడ్డారు.

By అంజి
Published on : 16 July 2025 1:02 PM IST

YS Jagan, YSRCP, elections, APnews

'వచ్చేది వైసీపీ ప్రభుత్వమే'.. వైఎస్‌ జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని మండిపడ్డారు. చంద్రబాబు రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో ప్రతిపక్షమైన తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, రైతు భరోసా సాయం ఎక్కడ? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఇంకో మూడేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోతారని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ జోస్యం చెప్పారు.

అధికారంలో ఉన్న చంద్రబాబు ఎలాంటి పనులు చేయడం లేదని చాలా మంది తమను కలుస్తున్నారని తెలిపారు. మూడేళ్ల తర్వాత మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తోందని, రైతులు, విద్యార్థుల తరఫున ఏడాది కాలంలో ఎన్నో పోరాటాలు చేశామని చెప్పారు. అటు పోలీసులపై తప్పుడు కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

మాట వినని అధికారులను అరెస్ట్‌ చేయిస్తున్నారని, సీనియర్‌ ఐపీఎస్‌లు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సంజయ్‌, సునీల్‌, కాంతిరాణా, విశాల్‌ గున్నీపై తప్పుడు కేసులు బనాయించారని, 8 మంది డీఎస్పీలను సస్పెండ్‌ చేశారని, వందల మంది పోలీసులను వీఆర్‌కు పంపారని, కొందరు పోలీసులు నీచపు పనులు చేయలేక రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

Next Story