ఏలూరు బాధితులకు సీఎం జగన్ పరామర్శ
YS Jagan consoles the victims of mysterious disease in Eluru. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో
By Medi Samrat Published on 7 Dec 2020 8:37 AM GMTపశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ.. ఆస్పత్రిలో చేరిన బాధితులను ఏపీ సీఎం జగన్ సోమవారం పరామర్శించారు. ఉదయం 10.30గంటలకు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న సీఎం.. బాధితులు చికిత్స పొందుతున్న వార్డుకు వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఓ బాలుడిని జగన్ పరామర్శించగా.. ఆ బాలుడు రెండు చేతులెత్తి నమస్కరించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలుడిని వారించిన జగన్.. అతని నుదిటిపై ముద్దు పెట్టాడు. బాధితులంతా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం జగన్ స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సాయంతో సహా ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నీటితో పాటు తదితర పరీక్షలు చేయించామని ఫలితాలన్నీ సాధారణంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. బ్లడ్ కల్చర్ పరీక్షకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందని దానికి కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఏలూరు అర్భన్ ప్రాంతంతోనే కాకుండా ఏలూరు రూరల్, దెందులూరు పరిధిలో కూడా ఇటువంటి కేసులు గుర్తించామని వాళ్లు సీఎంకు వివరించారు.
నిన్న ఏం జరిగిందంటే..?
ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లోడు ఒక్కసారిగా కండ్లు తిరిగి పడిపోయాడు.. ఆ పక్కవీధిలోనే నడుచుకుంటూ వెళ్తున్న ఓ పెద్దమనిషి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వ్యవసాయ పనులకు వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చిన ఓ మహిళ నోటి నుంచి నురగలు కక్కుకొంటూ కింద పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు వంద మంది మూర్ఛ, కండ్లు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణం ఒక్కసారిగా అల్లాడిపోయింది. ఆర్తనాదాలతో జనాలు దవాఖానలకు పరుగులు తీశారు.
శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఏలూరులోని పడమర వీధి, కొత్తపేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్‌నగర్, శనివారపుపేట, ఆదివారపుపేట, తంగళ్లమూడి, అరుంధతిపేట ప్రాంతాల్లో దాదాపు 292 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. కొందరు చిన్నారులు, మహిళలు, వృద్ధులకు ఫిట్స్ కూడా వచ్చాయి. ప్రజలు మూర్ఛ, కండ్లు తిరిగి ఎందుకు పడిపోతున్నారో డాక్టర్లకు అంతుచిక్కలేదు. బాధితులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో వారిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. పరిస్థితి విషమంగా ఉన్న పదిమందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.