అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ది చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం వారికి వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజధాని పేరుతో తొలి విడతలో 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమి అభివృద్దికే లక్ష కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. అది కూడా కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీరు లాంటి మౌళిక సదుపాయాలకే ఖర్చు చేశారు. ఆ లక్ష కోట్లు ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో తెలియదన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారని, వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు.. మరో 50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు.