ఆర్థిక సంక్షోభం ఉన్నా.. మేము వెనకడుగు వేయలేదు: వైఎస్ జగన్
మాట తప్పకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం తప్ప.. ఎలాంటి సాకులు కూడా తాము చెప్పలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు
By Medi Samrat Published on 13 Aug 2024 7:36 PM ISTమాట తప్పకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం తప్ప.. ఎలాంటి సాకులు కూడా తాము చెప్పలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నా మా ప్రభుత్వం సాకులు చూపలేదని.. ఎన్నికల్లో ఇచ్చిన మాటకోసం కట్టుబడి పనిచేశామన్నారు. ప్రతి ఇంటికీ మించి చేశాం.. చేసిన మంచి ఎక్కడికీ పోదన్నారు వైఎస్ జగన్. జగన్ పలావు ఇచ్చాడు బాగానే చూసుకున్నాడని ప్రజలు అంటున్నారని.. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారన్నారు. పలావు లేదు.. బిర్యానీ లేదని ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. మాడుగుల, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో జన్మభూమి కమిటీలు చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు వైఎస్ జగన్. రైతులందరికీ కూడా ఉచితంగా బీమా ఇచ్చేవాళ్లమని.. ఇప్పుడు ఉచిత పంటల బీమా ప్రీమియం కట్టడంలేదన్నారు. చంద్రబాబు మోసం చేస్తున్నారు.. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసం కనిపిస్తోందని విమర్శించారు వైఎస్ జగన్. జగనే ఉండి ఉంటే.. రైతు భరోసా అందేది. స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడీ తల్లులకు అమ్మ ఒడి అందేది. సున్నావడ్డీ కూడా వచ్చి ఉండేది. విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్ మెంట్, వసతి దీవెన వచ్చేదన్నారు. ఎప్పటి లాగే పథకాల అమలు జరిగి ఉండేది.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లేకపోవడతో ఇవేమీ రావడంలేదని విమర్శించారు.