ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని ప్రజలు మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సహాయక చర్యలను సమీక్షించారు. ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను జిల్లాలకు పంపిందని తెలిపారు.
తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. తుపాను తీరం వెంబడి కదులుతున్నందున తీరప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను బలహీనపడడం శుభసూచకమని అన్నారు. అయితే ఎక్కడా ఉపేక్షించవద్దని, ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని సీఎం జగన్ అన్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
అవసరమైన చోట సహాయ పునరావాస శిబిరాలు ప్రారంభించాలని, సహాయక శిబిరాలకు తరలించిన ఒక్కొక్కరికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2 వేలు చొప్పున పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. సహాయక శిబిరాల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.