ఏడో జాబితా రాబోతోంది.. వాళ్లలో టెన్షన్ మొదలైంది,,!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది.
By Medi Samrat Published on 5 Feb 2024 7:35 PM ISTవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన వైసీపీ 80కి పైగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పుడు ఏడో జాబితాపై కసరత్తు మొదలు పెట్టింది. దీంతో పలువురు నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు.
ఒంగోలు ఎంపీగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలో దించేందుకు పరిశీలన చేస్తోంది. బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ ఇంచార్జి అమంచి కృష్ణమోహన్ సైతం సీఎంవో కార్యాలయానికి వచ్చారు. తనకు పర్చూరు కాకుండా చీరాల అసెంబ్లీ నుంచి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరుతున్నారు. సీఎంవో నుంచి పిలుపురావడంతో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కూడా అక్కడికి వెళ్లారు. కోడూమూరులో ఇంచార్జిని నియమించడంతో కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనను వైసీపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా సుధాకర్‌తో చర్చలు జరుపుతోంది. వీరితో పాటు ఎమ్మల్యేలు పేర్ని నాని, శ్రీదేవి, బియ్యపు మధుసూదన్ కూడా సీఎంవో కార్యాలయంలోకి వెళ్లారు. రెండు రోజుల క్రితమే వైసీపీ ఆరో జాబితాను విడుదల చేసింది. 6వ లిస్టులో 10 మార్పులు జరిగాయి. ఆరో జాబితాలో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లు ఉన్నారు. ఇక ఏడో జాబితాలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయా అని ప్రజలలోనే కాకుండా వైసీపీ నేతల్లో కూడా ఆసక్తి మొదలైంది.