ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు : సీఎం జగన్
YCP supports NDA Presidential Candidate Draupadi Murmu. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మంగళవారం కలిశారు.
By Medi Samrat Published on 12 July 2022 5:31 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మంగళవారం కలిశారు. తాడేపల్లిలోని సీఎం జగన్‌ను కలిసిన ద్రౌపది ముర్ము.. అనంతరం తేనీటి విందులో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం జగన్ దంపతులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేదపండితులు ద్రౌపది ముర్ముకు వేదఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్ ద్రౌపది ముర్ముకు జ్క్షాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.
అనంతరం సీఎం నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డి సీకే కన్వెన్షన్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేజీపై సీఎం వైఎస్ జగన్.. ద్రౌపది ముర్ముకు పుష్ఫగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. .
రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించింది. వైసీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉంది. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది. మనమంతా ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలి. ఏ ఒక్క ఓటు వృథా కాకుండా చూసుకోవాలని సీఎం జగన్ అన్నారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు పలకడం సంతోషం అని అన్నారు. అందరితో చర్చించాకే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించామని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ట్రైబల్ మహిళకు అవకాశం లభించింది. పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరం మద్దతు పలకాలని కోరారు.