ఆ రెండు స్థానాలు ప్రకటించడం మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామానే : పేర్ని నాని

రిపబ్లిక్‌ డే రోజు వేడుకల్లో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు చెప్పారు.

By Medi Samrat  Published on  26 Jan 2024 3:45 PM GMT
ఆ రెండు స్థానాలు ప్రకటించడం మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామానే : పేర్ని నాని

రిపబ్లిక్‌ డే రోజు వేడుకల్లో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ముందే ఆ నియోజకవర్గాల పేర్లను ప్ర‌క‌టించారు. రిపబ్లిక్‌ డే రోజున తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే రెండు స్థానాలను ప్రకటిస్తున్నానని చెప్పారు. రాజోలు, రాజానగరంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ లాగా తనకు రిపబ్లిక్‌డే కలిసివస్తుందని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. "చంద్రబాబుకేనా ఉండేది ఒత్తిళ్లు.. నాపైనా ఒత్తిళ్లు ఉంటాయి.. ఆయన ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తే, నేను కూడా ఇద్దరిని ప్రకటిస్తున్నా.. ఆర్ అనే అక్షరం బాగుంది కదా.. రిపబ్లిక్ డేలో మొదటి అక్షరం.. అందుకే ఇవాళ రాజోలు, రాజానగరం అభ్యర్థులను ప్రకటిస్తున్నా" అంటూ పవన్ కల్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో పార్టీ నేతలు సంతోషంతో కేకలు వేస్తూ చప్పట్లు కొట్టారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ అభ్యర్థుల ప్రకటన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని.. చంద్రబాబు, పవన్ ల రాజకీయ డ్రామాలతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని అన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నప్పటికీ వాళ్లు మరో కొత్త డ్రామాను తెరపైకి తెచ్చారని పేర్ని నాని అన్నారు. గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు రాజోలు, రాజానగరం నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిలే లేరు. ఆ రెండు నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకు వదిలేశాడు. ఆ విధంగా కేటాయించిన సీట్లనే పవన్ నేడు ప్రకటించాడన్నారు. జనసేన కార్యకర్తల్లో తనపైనా, పార్టీ నేతలపైనా వస్తున్న వ్యతిరేకతను చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే పవన్ నేడు అభ్యర్థుల ప్రకటన చేశారని నాని వివరించారు. పవన్ కళ్యాణ్ అంత పౌరుషవంతుడే అయితే విశాఖ, తిరుపతి, కాకినాడ వంటి స్థానాలకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు పేర్ని నాని. దీన్నిబట్టే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని అర్థమవుతోందన్నారు పేర్ని నాని.

Next Story