కాషాయ దుస్తులు, నుదుట విభూది, చలువ కళ్లద్దాలు, మెడలో రుద్రాక్షమాల.. ధరించిన ఓ స్వామిజీ విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అచ్యుతాపురం మండల కేంద్రం, అప్పన్నపాలెం, ఆవసోమవరం గ్రామాల్లో స్వామిజీ పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవ రత్నాల పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే స్వామిజీ వేషంలో వచ్చింది మరెవరో కాదు.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు). ఒక్కరూ కూడా స్వామిజీ వేషంలో ఉన్న కన్నబాబును గుర్తించలేకపోయారు. ఎమ్మెల్యే కన్నబాబు.. మారువేషం ధరించి పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఆరా తీశారు. కాగా పలువురు ప్రజలు తమ సమస్యలను స్వామిజీ వద్ద వెలిబుచ్చుకున్నారు.
నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీలు, రోడ్లు బాగోలేవని, వీటితో పలు సమస్యలను భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రజలు చెప్పే సమాధానాలను ఓర్పుగా విన్న ఓమ్మెల్యే నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ తహశీల్దార్ రాంబాయి, ఎంపీడీవో కృష్ణ దగ్గరికి వెళ్లి.. ప్రజల సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. అయితే ఇన్ని ప్రజల సమస్యలు చెబుతున్న.. మీరు ఎవరూ అంటూ అధికారులు స్వామిజీని ప్రశ్నించారు. దీంతో వేషం తొలగించుకున్న ఎమ్మెల్యే కన్నబాబు.. వారిని షాక్‌కు గురి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలు 100 శాతం సంతోషంగా ఉన్నారని చెప్పారు.