ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు 'కుప్పం ఎమ్మెల్యే' అని సంబోధించడం సభలో దుమారానికి దారితీసింది. 'సూపర్-6' పథకాలపై జరిగిన లఘు చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని 'కుప్పం ఎమ్మెల్యే' అని ప్రస్తావించారు. దీంతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా తమ స్థానాల నుంచి లేచి నిరసన తెలిపారు. సభా నాయకుడైన ముఖ్యమంత్రిని అగౌరవపరిచేలా మాట్లాడారని, రమేశ్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
సభ్యుల నిరసనతో జోక్యం చేసుకున్న మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు. రమేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని నిర్ధారించారు. వాటిని సభా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులందరూ నిబంధనలకు కట్టుబడి, సభా సంప్రదాయాలను గౌరవిస్తూ హుందాగా ప్రవర్తించాలని ఆయన సూచించారు. చర్చలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే 'సూపర్-6' సూపర్ హిట్ అంటూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని రమేశ్ యాదవ్ ఆరోపించారు.