త్యాగాలు చేయడానికి సిద్ధమంటున్న వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పలు పార్టీల లోనూ ఆశావహుల మధ్య పోటీ నెలకొంది.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పలు పార్టీల లోనూ ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. అధికార వైసీపీలో చాలా మంది సిట్టింగ్ లను పక్కన పెట్టేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక కొందరి భవితవ్యం మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్యాగానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్దమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం అని చెప్పారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభల్లో విజయోత్సవ కళ కనిపిస్తోందని అన్నారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక అభివృద్ధి పై తాము చర్చకు సిద్దమన్నారు. టీడీపీ హయాంలో 30 నుంచి 40 వేల కోట్ల పెట్టుబడులు వస్తే వైసీపీ హయాంలో 90 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఒంటరిగా రెండు సీట్లు ప్రకటించినప్పుడు కాపోడు.. మగోడు అనుకున్నాను.. కానీ 25-30 సీట్లకు జనసేన ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోందని తెలిపారు. అదే జరిగితే జనసేన నాయకులు బాధపడక తప్పదని అన్నారు.