పలువురు నేతలు వైసీపీని వీడడానికి సిద్ధమయ్యారు. ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు. వైసీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడుగా చెప్పుకునే ఆళ్ల నాని పార్టీని వీడడం నిజంగా షాకింగ్ న్యూస్. ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పెద్దగా బయటకు రాలేదు.. కొద్దిరోజుల తర్వాత యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. కానీ ఆయన వైసీపీని వీడడానికే సిద్ధమయ్యారు.
ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు.. తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ కు పంపారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు కూడా రాజీనామా చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. 2004, 2009లో ఏలూరు నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని.. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షించారు.