టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ

వైజాగ్ లో గత ప్రభుత్వం రుషికొండ ప్రాంతంలో కట్టిన భవనాలపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.

By Medi Samrat  Published on  16 Jun 2024 9:00 PM IST
టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ

వైజాగ్ లో గత ప్రభుత్వం రుషికొండ ప్రాంతంలో కట్టిన భవనాలపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. టీడీపీ నాయకులు ఆ బిల్డింగ్ విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ టీడీపీ నేతలు వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. "రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే.. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..!" అంటూ టీడీపీ అధికార ఖాతాలో పోస్టు పెట్టారు.

దీనిపై వైసీపీ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చింది. "రుషికొండలో ఉన్నది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. ఆ భవనాలు ఎవరి సొంతం కూడా కావు. విశాఖ నగరానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆ భవనాలు నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టం. అటువంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక రాష్ట్రపతి వచ్చినా, ఒక ప్రధానమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రులు, గవర్నర్ లు వచ్చినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి" అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.

Next Story