తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు, వైసీపీ నాయకులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వీట్‌గా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

By అంజి
Published on : 17 April 2023 10:08 AM IST

YCP , Telangana, Pawan kalyan, APnews

తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు, వైసీపీ నాయకులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వీట్‌గా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడం సరికాదని ఓ వీడియోలో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కొందరు వైసీపీ నేతలు ప్రతి స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కొందరు నాయకులైతే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా కామెంట్లు చేశారు. దీనిపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. హరీశ్‌ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు.

అయితే ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తనకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించిందన్నారు. నాయకులు హద్దులు దాటి మాట్లాడటం సరికాదన్నారు. పాలకులు వేరు ప్రజలు వేరన్న పవన్‌.. పాలకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. విమర్శించాలనుకుంటే.. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని విమర్శించండి.. అంతేకానీ తెలంగాణ ప్రజానీకాన్ని ఈ వివాదంలోకి లాగొద్దన్నారు. ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే వైసీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు.

Next Story