నలుగురికి మంత్రి పదవులిస్తే బీసీలందరీకీ మేలు జరుగుతుందా?
Yanamala Ramakrishnudu Comments On CM Jagan. దేశంలో మొట్టమెదటిగా మహాత్మా బిరుదు పొందిన వ్యక్తి జ్యోతిబాపులే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
By Medi Samrat Published on 11 April 2022 10:15 AM GMTదేశంలో మొట్టమెదటిగా మహాత్మా బిరుదు పొందిన వ్యక్తి జ్యోతిబాపులే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. జ్యోతిబాపులే సిద్దంతాలు, ఆశయాలు అందరూ స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ కి ఆదర్శప్రాయుడు జ్యోతిబాపులే అని తెలిపారు. టీడీపీ ఏర్పడక ముందు అసలు బీసీలకే గుర్తింపే లేదని.. బీసీల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించి.. సంక్షేమ పధకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు.
మహిళలకు రిజర్వేషన్లు, రూల్ ఆప్ రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. 25 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 40 శాతానికి పెంచేందుకు నాడు దైర్యంగా టీడీపీ నిర్ణయం తీసుకుందని.. కానీ కొంత మంది కోర్టుకెళ్లి అడ్డుకున్నారని అన్నారు. బీసీలే టీడీపీకి వెన్నెముక అన్నారు. బీసీల్లో నలుగురికి మంత్రి పదవులిస్తే బీసీలందరీకీ మేలు జరుగుతుందా? అని ప్రశ్నించారు. బీసీలు సమాజంలో ఎదగాలంటే ఆర్దిక సమానత్వం కావాలని, విద్యలో ఎదగాలని అన్నారు.
బీసీ కులాలన్నీ ఐక్యంగా ఉంటేనే గుర్తింపు ఉంటుందని.. వచ్చే తరాలకైనా సమాజంలో సమానత్వాన్ని అందించేందుకు బీసీలంతా ఐక్యంగా కృషి చేయాలని కోరారు. జగన్ రెడ్డి రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి బీసీలకు అన్యాయం చేశారని.. టీడీపీ హయాంలో ప్రతి ఏటా బీసీ సబ్ ప్లాన్ కి రూ. 12 వేల కోట్లు కేటాయించామన్నారు. బీసీల నిధుల్ని జగన్ రెడ్డి దారి మళ్లిస్తున్నారని, బీసీల నిధులు ఏం చేస్తున్నారో జగన్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీ జనగణన జరగాలని.. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికన సంక్షేమ పధకాలు అందించేందుకు చంద్రబాబు నాయుడు సిద్దంగా ఉన్నారని తెలిపారు.