మహిళలు పొట్టి దుస్తులు ధరించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి : హోంమంత్రి మహమూద్ అలీ

Women wearing fewer clothes creates trouble, says Home Minister Ali, sparks row. హైదరాబాద్‌లోని ఓ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2023 2:35 PM GMT
మహిళలు పొట్టి దుస్తులు ధరించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి : హోంమంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్‌లోని ఓ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళల వ‌స్త్ర‌ధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. సంతోష్‌నగర్‌లోని కెవి రంగా రెడ్డి మహిళా కళాశాల విద్యార్థులు పరీక్షలకు ముందు బురఖాలను తొలగించాలని ఆదేశించడంతో వివాదం ప్రారంభమైంది, ఇది విద్యార్థులు, వారి కుటుంబాలకు కోపం తెప్పించింది. దీంతో ఈ ఘటన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ దాకా వెళ్ళింది.

ఈ ఘటనపై మంత్రి అలీ స్పందిస్తూ, "ప్రతి ఒక్కరికి వారు కోరుకున్నది ధరించే హక్కు ఉంది. హిందూ లేదా ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం దుస్తులు ధరించడం ఆచరించాలి. యూరోపియన్ సంస్కృతిని అనుసరించకూడదు. మనం మంచి బట్టలు ధరించాలి.. మన ఆచారాలను గౌరవించాలి. ముఖ్యంగా, మహిళలు పొట్టి దుస్తులు ధరించకూడదు. వారు తమ తలలను అలాగే శరీరాలను వీలైనంత వరకు కప్పుకోవాలి. మహిళలు పొట్టి బట్టలు ధరించడం వ‌ల్ల‌ సౌకర్యంగా ఉండదు. వాళ్లు అనువైన దుస్తులు వేసుకుంటే ప్రశాంతంగా ఉంటారు.” అని అన్నారు.

హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి, మహిళల బట్టల ఎంపికల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మానవ హక్కుల కార్యకర్త జస్వీన్ జైరత్ బాధిత విద్యార్థినులకు తన మద్దతును తెలిపారు. మహిళలు ఏమి ధరించాలో నిర్దేశించడంపై దృష్టి పెట్టకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఆమె మాట్లాడుతూ, “మహిళల స్వాతంత్య్రాన్ని విస్మరిస్తూ, కాలం చెల్లిన మూస పద్ధతులను కొనసాగించే విధంగా ఒక పబ్లిక్ ఫిగర్ వ్యాఖ్యలు చేయడం నిరుత్సాహపరుస్తుంది. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించకుండా, బాధిత మహిళలకు మద్దతుగా నిలవాలి. సముచితమైన దుస్తులు గురించి వాదనలకు దిగడం కంటే, వారి హక్కులను కాపాడడం.. విద్యా సంస్థల్లో మంచి వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టాలి." అని అన్నారు.

హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం బురఖాలు ధరించి పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థినులను పరీక్షకు హాజరుకాకుండా సిబ్బంది అడ్డుకున్నారు. పరీక్ష రాయాలంటే హిజాబ్ ను తొలగించాలని సూచించారు. దీంతో వారు హిజాబ్ ను తొలగించి.. పరీక్ష రాయాల్సి వచ్చింది. పరీక్ష ముగిసిన తర్వాత ప్రాంగణం బయట హిజాబ్ ధరించమని కోరారు. మమ్మల్ని బలవంతంగా మా బురఖాని తీయమని.. పరీక్ష తర్వాత బయట ధరించమని చెప్పారని విద్యార్థినులు వాపోయారు. పలువురు ముస్లిం విద్యార్థినులు శుక్రవారం నిర్వహించిన డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్షకు హిజాబ్‌ ధరించి వచ్చారు. అయితే పరీక్షా కేంద్రంలోకి వారిని కాలేజీ సిబ్బంది అనుమతించకపోవడంతో విద్యార్థినులకు, కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది.

ఈ ఘటనపై ఆయన స్పందన కోసం న్యూస్‌మీటర్ బృందం.. మంత్రి మహమూద్ అలీ కార్యాలయాన్ని సంప్రదించింది. ఆయన స్పందన కోసం వేచి మా బృందం వేచి ఉంది.


Next Story