రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు. సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. నాలుగు బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని కోరారు.
అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.