కృష్ణా జిల్లా నందిగామ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. మచిలీపట్నంలో ఏఅర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జిల్లేపల్లి ప్రశాంతి ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ప్రశాంతి ఆత్మహత్యపై తల్లిదండ్రులు, గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులే ప్రశాంతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతి తల్లిదండ్రులను పరామర్శించడానికి ఇద్దరు యువకులు సోమవారం గ్రామానికి రావడంతో బంధువులు, గ్రామస్తులు ఆగ్రహించారు.
ప్రశాంతిని వారే పక్కా ప్రణాళికతో హత్య చేశారని బంధువులు, గ్రామస్తులు కోపోద్రిక్తులై.. ఆ యువకులను ఇద్దరిని గృహనిర్బంధం చేశారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ఇదిలావుంటే.. ఆ యువకులలో ఒకరు మాట్లాడుతూ.. చనిపోయిన యువతి మాకు మరదలు అవుతుందని.. మా తమ్ముడు, ఆమె ప్రేమించుకుంటున్నారని తెలిపాడు. చనిపోయే ముందు రాత్రి కూడా వారిద్దరూ ఫోన్ మాట్లాడుకున్నారని.. రూమ్ మేట్ తో గొడవ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని.. జరిగిన ఘటనలో మా తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్దమేనని తెలిపాడు.
ప్రశాంతి సోదరి ప్రభావతి మాట్లాడుతూ.. సడెన్‌గా చనిపోయిందని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే మేం ఘటనా స్థలానికి వెళ్లాం. అప్పటికే మా చెల్లెలిని ఆసుపత్రికి తరలించారు. ఆ ఇద్దరే మా చెల్లెలిని చంపారని మాకు అనుమానం వుందని.. మా చెల్లెలిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. మాకు న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు.