లేపాక్షి అతి త్వరలోనే యునెస్కో హెరిటేజ్ సైట్ కానుందా..?

Will Lepakshi Temple be AP's first UNESCO Heritage Site. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి యునెస్కో వారసత్వ ప్రదేశంగా లేపాక్షి దేవాలయం నిలిచే అవకాశం ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 April 2022 3:15 PM IST
లేపాక్షి అతి త్వరలోనే యునెస్కో హెరిటేజ్ సైట్ కానుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి యునెస్కో వారసత్వ ప్రదేశంగా లేపాక్షి దేవాలయం నిలిచే అవకాశం ఉంది. 16వ శతాబ్దపు నాటి వీరభద్ర స్వామి దేవాలయం, అనంతపురం జిల్లా లేపాక్షిలోని ఏకశిలా నంది విగ్రహం 2022లో భారతదేశంలోని యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి. హైదరాబాద్ చుట్టుపక్కల స్మారక చిహ్నాలతో కూడిన కుతుబ్ షాహీతో సహా తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన రెండు ఎంట్రీలలో లేపాక్షి కూడా ఒకటి.

తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించినప్పటి నుంచి లేపాక్షిని యునెస్కో జాబితాలో చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ ప్రయత్నిస్తోంది. ప్రసిద్ధ వీరభద్ర దేవాలయం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి, దీనిని వీరన్న, విరూపన్న సోదరులు నిర్మించారు. ఈ ఆలయం విజయనగర నిర్మాణ శైలి, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఒకే గ్రానైట్ రాయితో చేసిన భారీ నంది ప్రధాన ఆకర్షణలలో ఒకటి. లేపాక్షి బసవన్నగా ప్రసిద్ధి చెందిన లేపాక్షి నంది, ఆలయానికి 250 మీటర్ల దూరంలో కూర్చున్న భంగిమలో ఉన్నటువంటి ఏకశిలా విగ్రహం.

సర్వే చేయనున్న కమిటీ

"యునెస్కోకు సమర్పించడానికి ఆలయ డాక్యుమెంటేషన్ సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. జూన్‌లో తుది జాబితాను ప్రకటిస్తారు. యునెస్కో బృందం చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించి, అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది," అని సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజీకి చెందిన ఒక అధికారి తెలిపారు. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను పొందేందుకు అన్ని అర్హతలు లేపాక్షికి ఉన్నాయి. ఈ లిస్టులోకి ఎంపిక చేయబడితే, లేపాక్షి ఆంధ్రప్రదేశ్ నుండి మొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశం అవుతుంది.

చరిత్ర

లేపాక్షి ఆలయాన్ని క్రీ.శ. 1530లో పెనుకొండ పాలకులైన అచ్యుతరాయ పాలనలో విజయనగర సామ్రాజ్యంలో గవర్నర్లుగా ఉన్న సోదరులు విరూపన్న నాయక మరియు వీరన్న నిర్మించారు. ఆలయంలో కన్నడ శాసనాలు ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం, ఈ ఆలయం శివుని యొక్క ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్పబడింది. శివలింగాన్ని రక్షించే ఏడు తలల పాము యొక్క భారీ విగ్రహం ప్రధాన ఆకర్షణలలో ఒకటి. 'వేలాడే స్తంభం' మరో ఆకర్షణ. స్తంభం కొద్దిగా స్థానభ్రంశం చెంది, ఒకవైపు మాత్రమే భూమిని తాకుతున్నందున స్తంభం యొక్క పునాది, నేల మధ్య అంతరం ఉంటుంది. ఆలయాన్ని సందర్శించే చాలా మంది భక్తులు ఆ గ్యాప్ గుండా కాగితం లేదా గుడ్డను ఉంచి వేలాడే స్తంభం విశిష్టతను తెలుసుకుంటూ ఉంటారు.

7 స్మారక చిహ్నాలు/స్థలాలు ప్రతిపాదన

పురావస్తు శాఖ, అమరావతి ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని స్మారక చిహ్నాలు, ప్రదేశాలను UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించే ప్రక్రియ సెప్టెంబర్ 2021 లో ప్రారంభమైంది. ఏడు చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ప్రతిపాదించబడ్డాయి - గుంటూరు జిల్లాలోని అమరావతి మహా స్థూపం, పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి బౌద్ధ గుహలు, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోట, కడపలోని గండికోట, నాగార్జున కొండ, అనంతపురం జిల్లాలోని లేపాక్షి, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం లిస్టులో ఉన్నాయి.




























Next Story