మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. 2017లో ఖైదీ నెం.150తో సినిమాల్లోకి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు. చిరంజీవి రాజకీయాల నుంచి నిష్క్రమించిన తర్వాత రాజకీయ విషయాలపై మౌనం వహిస్తూ సినీ పరిశ్రమకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ వస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనతో సహా ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. కానీ ఇటీవల ఆయన జనసేనకు 5 కోట్ల విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది NDA కూటమి అభ్యర్థులకు ఓటు వేయమని ప్రజలను అభ్యర్థించారు. దీన్ని కొందరు స్వాగతించినా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.
అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి చిరంజీవి వస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. చిరంజీవి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తారని.. చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్‌లను ఒకే వేదికపైకి వస్తే మెగా అభిమానులకు చాలా పెద్ద క్షణం అవుతుంది. ఇప్పటి వరకు జనసేన తరపున సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ప్రచారం చేయగా మెగా స్టార్ రాక జనసేనకు గట్టి బూస్ట్ అందించవచ్చు. ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో వీరిద్దరూ కలసి వస్తారా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.