ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పుపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో జనసేన ఐదు మంత్రి పదవులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సీఎంతో కలిపి 26 మందికి మించి మంత్రివర్గం ఉండకూడదనేది నిబంధన. ఈసారి టీడీపీ నుంచి ఊహించినదానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆశావహులు కూడా ఎక్కువే ఉండనున్నారు.
దీంతో చంద్రబాబు నాయుడు సహా 20 టీడీపీకి, జనసేనకు 5, బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. దీనిపై రేపు ఎమ్మెల్యేల భేటీలో క్లారిటీ రావొచ్చు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. బీజేపీ,టీడీపీ,జనసేన మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ ఎమ్మెల్యేలు రేపు భేటీ కానున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలో ఈ సమావేశం జరగనుంది. సీఎంగా ఎల్లుండి చంద్రబాబు ప్రమాణ స్వీకారం, మంత్రి పదవుల కేటాయింపు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం.