మార్చి నాటికి 4 వేల ఇళ్లు పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
By Medi Samrat
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు. అసలు అమరావతిలో పనులే జరగడం లేదని ఆరోపణలు చేస్తున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి చూడాలని సూచించారు...రాజధాని నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి నారాయణ...శాఖమూరు రిజర్వాయర్,కొండవీటి వాగు,గ్రావిటీ కెనాల్ తో పాటు అనంతవరం పార్కును మంత్రి నారాయణ పరిశీలించారు..ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు మంత్రి.
అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 2014-19 మధ్యలోనే టెండర్లు పూర్తిచేసి పనులు కూడా ప్రారంభించాం...గత ప్రభుత్వం మూడుముక్కలాటతో మొత్తం నాశనం చేసింది...అసలు రాజధాని ఎక్కడో క్లారిటీ ఇవ్వలేదు...రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న టెండర్లు క్లోజ్ చేయడంతో పాటు ఇతర ఆర్ధిక అంశాలను కొలిక్కి తీసుకొచ్చి పాత నిర్మాణాలపై ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేసి ముందుకెళ్తున్నామన్నారు మంత్రి...ప్రస్తుతం రాజధానిలో అన్ని పనులు ప్రారంభమయ్యాయి...వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అధికారులు,ఉద్యోగులకు సంబంధించి 4 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు...ఇదే సమయంలో రోడ్లు,డ్రైనేజి పనులు కూడా దాదాపు పూర్తికావచ్చినట్లు చెప్పారాయన...అయితే లేఅవుట్ రోడ్ల డిజైన్లు మాత్రం ఈనెలాఖరుకు ఐఐటీ నిపుణులు ఫైనల్ చేస్తారని అన్నారు.
ఇక రాజధానిలో వరద ముంపు నివారణ కొరకు కాలువల డిజైన్లు నెదర్లాండ్స్ అధికారులతో చేయించామన్నారు మంత్రి..రాజధానిలో కొండవీటి వాగు 23.6 కిమీ,పాలవాగు 16.5 కిమీ,గ్రావిటీ కెనాల్ ను 7.843 కిమీలు మొత్తంగా 47.94 కిమీ మేర కాలువలను వెడల్పు చేసి లోతుగా తవ్వుతున్నామన్నారు...వీటితో పాటు శాఖమూరు రిజర్వాయర్ ను 0.03 టీఎంసీల కెపాసిటీతో 50 ఎకరాల్లో కృష్ణాయపాలెం రిజర్వాయర్ ను 0.1 టీఎంసీతో 190 ఎకరాల్లో అలాగే నీరుకొండ రిజర్వాయర్ ను 0.4 టీఎంసీల కెపాసిటీతో 440 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు...వర్షాల కారణంగా కాలువల పనులు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయని అన్నారు...2027 అక్టోబర్ లోగా ఆయా పనులు పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ వచ్చే ఏడాది చివరకు పూర్తిచేసేలా వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు.
రాజధానిపై కొనసాగుతున్న కుట్రలు..
అమరావతిలో పనులు జరగడం లేదని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని..అమరావతిపై ఎన్ని కుట్రలు పన్నినా మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని అన్నారు...బ్లూ- గ్రీన్ రాజధానిగా అమరావతి ఉండేలా 30 శాతం పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు..కృష్ణా రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని....ట్రంక్ రోడ్లు పనులు ఇప్పటికే ప్రారంభం కాగా లేఅవుట్ రోడ్లకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు..రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో గతంలో పాతిన సరిహద్దు రాళ్లు తొలగిపోయాయని....తాజాగా ఆయా లేఅవుట్ లలో మౌళికవసతులు కల్పించే కాంట్రాక్ట్ ఏజెన్సీలు సరిహద్దు రాళ్లను పాతుతాయని తెలిపారు.
900 మంది రైతులకు వివిధ కారణాలతో కౌలు నిధులు పెండింగ్ లో ఉన్నాయి
రాజధానిలో సుమారు 25 వేల మందికి ఈ ఏడాది కౌలు నిధులు జమ చేయాల్సి ఉండగా...నిన్నటి వరకూ రకరకాల కారణాలతో 7 వేల మందికి జమ కాలేదన్నారు.తాజాగా పెండింగ్ లో ఉన్న నిధులు కూడా అకౌంట్లలో జమ అయ్యాయి...అయితే బ్యాంకు అకౌంట్ తప్పుగా ఉండటం,కొంతమంది మరణించడం,మరికొంతమంది భూమి అమ్ముకోవడం వంటి కారణాలతో 900 మందికి నిధులు జమకాలేదన్నారు..అటువంటి అకౌంట్లను మరోసారి పరిశీలిస్తు్న్నట్లు మంత్రి నారాయణ తెలిపారు...కౌలు నిధులు జమకాని రైతులు వెబ్ సైట్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
సీఎం చంద్రబాబుపై సింగపూర్ ప్రభుత్వానికి ఎంతో నమ్మకం ఉంది
గత ప్రభుత్వం సింగపూర్ కు మన సీఐడీ అధికారులను పంపించి వారిపై విచారణ చేయించింది...దాంతో సింగపూర్ ప్రభుత్వం ఎంతో బాధపడింది...గత ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ - ఏపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి...తిరిగి ఆ సంబంధాలు పునరుద్దరించేందుకే సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లారని అన్నారు.
సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రెసిడెంట్,సీనియర్ మంత్రులను కలిసారు...అన్ని విధాల సహకరిస్తామని వారు చెప్పారు.పరిశ్రమల పెద్దలను కలిసారు.అధికారులతో చర్చించమని సీఎం ఆదేశించారు..
సింగపూర్ నేషనల్ పార్క్స్ అథారిటీ సీఆర్డీఏకు సపోర్ట్ చేస్తామని తెలిపారు...పది రోజుల్లో అథారిటీ సభ్యులు అమరావతికి రానున్నారు..సీఎం చంద్రబాబుపై సింగపూర్ ప్రభుత్వానికి ఎంతో నమ్మకం ఉందని....ఖచ్చితంగా సింగపూర్ సపోర్ట్ ఏపీకి ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు.