వచ్చే నాలుగేళ్లలో 12.59 లక్షల గృహాలను పూర్తి చేస్తాం
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.
By - Medi Samrat |
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఐదేళ్లలో 15.59 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని, ఇందులో ఇప్పటికే 3.00 లక్షల గృహాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 12.59 లక్షల గృహాలను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయడం జరుగుతుంది మంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటికే పూర్తి చేసిన 3.00 లక్షల గృహాలతో పాటు వచ్చే ఉగాదికి 5.00 లక్షల గృహాలను, జూన్ కల్లా మరో 87 వేల గృహాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పిఎంఏవై-1.00 పథకం అమలు గడువును కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించిన నేపథ్యంలో ఈ పథకం క్రింద ఇప్పటి వరకూ ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను కూడా ఈ ఏడాది డిశంబరు కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఐదేళ్ల కాలంలో దాదాపు 15.59 లక్షల గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని, అయితే వీటిలో పి.ఎం.ఏ.వై.-1.0 క్రింద 8.87 గృహాలు, పిఎంఏవై-2.0 అర్బన్ క్రింద 91 వేల గృహాలు మరియు పిఎంఏవై గ్రామీణ్ క్రింద 5.81 లక్షల గృహాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వీటికి అదనంగా పిఎంఏవై-1.00 పథకం క్రింద ఇప్పటి వరకూ ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను కూడా ఈ ఏడాది డిశంబరు కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. పిఎంఏవై గ్రామీణ్ క్రింద 5.81 లక్షల గృహాలను నిర్మించాలనే లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 3.47 లక్షల మంది ఆవాస్ యోజన యాప్ లో ధరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇంకా ఎవరన్నా అర్హులు ఉంటే ఈ నెలాఖరు లోపు ఈ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తిచేశారు.
16 నెలల్లో 3 లక్షల గృహాలను పూర్తిచేశాం….
ఈ గృహ నిర్మాణాలకు సంబందించి ప్రతిపక్ష పార్టీ సభ్యులు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ఎంతో దురదృష్టకరమన్నారు. ఐదేళ్ల కాలంలో గత ప్రభుత్వం కేవలం 6.00 లక్షల గృహాలను మాత్రమే పూర్తి చేస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల కాలవ్యవధిలోనే 3.192 లక్షల గృహాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 18.61 లక్షల గృహాలను మంజూరు చేసి, వాటిలో కేవలం 6.00 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే 2014-19 మద్య కాలంలో తమ ప్రభుత్వ హయాంలో 8.687 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. 2014-19 మద్య కాలంలో ఎన్.టి.ఆర్.గృహ నిర్మాణ పథకం క్రింద మంజూరు చేసి వివిధ దశల్లో ఉన్న 4.7 లక్షల గృహాలను గత ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా పూర్తయిన 2.7 లక్షల గృహాలకు రూ.920 కోట్లు చెల్లింపు చేయకుండా ఎగ్గొట్టి ఎస్సీ, ఎస్టీ, బి.సి., ఇబిసి వర్గల వారికి అన్యాయం చేయడం జరిగిందన్నారు. అయితే తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పక్షపాత దోరణితో ఏమాత్రం వ్యవహరించకుండా గత ప్రభుత్వం మంజూరు చేసి 18.61 లక్షల గృహాల్లో మిగిలి ఉన్న 11.90 లక్షల గృహ నిర్మాణాలను కొనసాగించడం జరుగుచున్నదన్నారు. అయితే ఈ ఇళ్లను మేమే ప్రారంభించాము అని గొప్పలు చెప్పుకుంటున్న గత ప్రభుత్వ ప్రతినిధులు వీటి నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇళ్ల నిర్మాణానికై గత ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షల్లో రూ.1.50 లక్షలు కేంద్రప్రభుత్వ నిధులు కాగా, మిగిలిన రూ.30 వేలు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులు మాత్రమే అన్నారు. అంతేగానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేది ఆయన తెలిపారు.
81 వేల మందికి ఇళ్ల స్థలాలు….1.15 లక్షల మందికి పొజిషన్ సర్టిఫికేట్లు….
ఇళ్ల స్థలాలు కావాల్సిన వారిని గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటి వరకు 81 వేల మందికి ఇళ్ల స్థలాలు కావాల్సి ఉందనే విషయాన్ని గుర్తించడం జరిగిందన్నారు. అదే విధంగా దాదాపు 1.15 లక్షల మంది ప్రభుత్వ మరియు పోరంబోకు స్థలాలలో ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికేట్లను అందజేయాల్సినదిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కామన్ వాల్ తో ట్విన్ హౌసెస్ నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తూ త్వరలో జి.ఓ.ను కూడా జారీ చేయనునట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ,ఎస్టీ,బిసి., పివిటిజిల గృహ నిర్మాణాలకు తమ ప్రభుత్వం అదనంగా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని గత ప్రభుత్వం నిలిపివేసిందని, అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అదనపు ఆర్థిక సహాయాన్ని పునరుద్దరిస్తూ దాదాపు రూ.3,200 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మైనారిటీలకు కూడా అదనంగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
రూ.80 కోట్ల మేర అవినీతికి పాల్పడిన రాక్రీట్ నిర్మాణ సంస్థ….
గృహ నిర్మాణాల విషయంలో గతంలో జరిగిన అవకతవకలపై విజిలెన్సు నివేదిక అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నివేదిక ప్రకారం రాక్రీట్ నిర్మాణ సంస్థ గృహ నిర్మాణాల విషయంలో పలు అవకతవలకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు. ఈ సంస్థకు 50,402 ఇళ్ల నిర్మాణ పనులను అప్పగించడం జరిగిందని, అయితే వీటిలో 47,850 గృహ నిర్మాణాలను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసి గృహ లబ్దిదారులను తీవ్ర అన్యాయానికి గురిచేయడం జరిగిందన్నారు. దాదాపు రూ.80 కోట్ల మేర అవినీతికి ఈ సంస్థ పాల్పడినట్లు వెల్లడైందని, ఈ సొమ్మును ఆ సంస్థ నుండి రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మరియు ఏ ఏ జిల్లాల్లో అవకతవలకు పాల్పడటం జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్ గా అవకాశం అన్ని రకాల కేసులను నమోదు చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.