స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నాం: మంత్రి లోకేశ్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం..అని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By - Knakam Karthik |
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం..అని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. నవంబర్ 14, 15తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ..గత 15 నెలల్లో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగాం, విజనరీ లీడర్ చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధించడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది లీడర్ షిప్ ట్రాక్ రికార్డ్. మాకు సుస్థిరమైన నాయకత్వం ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆయన అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు.
2వది స్పీడ్ ఆఫ్ డూయింగ్ కు మేం ప్రాధాన్యత నిస్తున్నాం. ప్రాజెక్టు ఆరునెలలు ఆలస్యమైతే మొత్తం బిజినెస్ ప్లాన్ దెబ్బతింటుంది. భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతోంది. గత ఏడాది జూన్ లో వారితో చర్చలు జరిపినపుడు, వారు మూడు ప్రత్యేక అభ్యర్థనలు చేయగా, కేవలం 12గంటల్లోనే పరిష్కరించాం. నవంబర్‌లో ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. దేశంలో అతిపెద్ద డాటా సెంటర్ త్వరలో విశాఖపట్నానికి రాబోతోంది. టిసిఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకే మేం ఎకరా 99 పైసలకే భూములు ఇచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం.
3వది మావద్ద ఉత్సాహవంతంగా పనిచేసే కొత్తతరం యువనాయకత్వం ఉంది. మొత్తం శాసనసభలో 50శాతం తొలిసారి గెలిచినవారు. మంత్రివర్గంలోని 25మందిలో 17మంది కొత్తవారే. వారందరికీ స్టార్టప్ మైండ్ సెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ స్టేట్. మేమంతా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న తపన, పట్టుదలతో పనిచేస్తున్నాం. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వాన గత 15నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగాం. ఎంఓయులతో సరిపెట్టకుండా ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యం. ఇటువంటి సాహసోపేతమైన హామీని దేశంలో మేం మాత్రమే ఇచ్చాం. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను తెచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన ధ్యేయం..అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.