టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడి.. తంబళ్లపల్లిలో ఉద్రిక్తత..!
War Between TDP YCP Workers. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లు వద్ద తీవ్ర
By Medi Samrat Published on 11 Dec 2020 4:37 PM ISTచిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుల వాహనాలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ నేతల వాహనశ్రేణిపై రాళ్లదాడి చేయడంతో నాలుగు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలవ్వడంతో.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నేతలు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, శంకర్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు బి.కొత్తకోటలో ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని శుక్రవారం ఉదయం పరామర్శించారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా కురబలకోట మండలం అంగళ్లు వద్ద ఈ ఘటన జరిగింది. దాడి గురించి తెలుసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు భారీగా మోహరించారు.
ఈఘటనపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పరామర్శకు వెళ్లే నేతలపై దాడి చేయడం ఫాసిస్టు చర్య అని విమర్శించారు. జగన్ ఫాసిస్టు పాలనకు ఈ దాడులే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా'కు గండికొట్టారని, జగన్ ను చూసుకుని వైసీపీ ఫాసిస్టు మూకలు విజృంభిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. తాము ఎంత పెద్ద నేరానికి పాల్పడినా ఏమీ కాదన్న ధీమాతో రెచ్చిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు లేకుండా నేరగాళ్ల రాజ్యం తీసుకువచ్చారని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పోలీసు వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. కిషోర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వైసీపీ నేతల దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. వైసీపీ దాడులకు భయపడేది లేదన్నారు. ప్రజాసమస్యలపై టీడీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత డీజీపీ గౌతమ్ సవాంగ్‌దేనని నారా లోకేష్ అన్నారు.