ఓటర్లను జాగృతం చేసేందుకు వైజాగ్‌లోని ఓ సెలూన్ నిర్వహకుడు వినూత్నంగా ఆలోచించాడు. విశాఖపట్నంలోని కంచరపాలెం మెట్టు ముత్యాలమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న ఆర్కే స్మార్ట్ సెలూన్ అధినేత మల్లువలస రాధాకృష్ణ ఓటర్లకు తమ హక్కులపై అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రచారాన్ని ప్రారంభించారు.
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరుగనుంది. పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే మిగిలివుంది. దీంతో రాధాకృష్ణ ఉచిత హెయిర్‌కట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఓటు ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఉచిత హెయిర్ కటింగ్ ఆఫర్‌ను ప్రకటించినట్లుగా వెల్లడించాడు.
“ఓటు మన హక్కు. మన భవిష్యత్తును, భావి తరాల భవిష్యత్తును కాపాడే ఆయుధం. అయితే ఎన్నికల రోజున బయటకు వెళ్లి ఓటు వేయాలనే ఆసక్తి కొందరిలో తగ్గుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు మే 13న ఓటు వేసిన వారికి ఉచిత హెయిర్‌కట్ చేయబడును అని ఆఫర్ పెట్టాం. ఆ రోజు తమ హక్కును వినియోగించుకుని వచ్చిన వారందరికీ మా బృందం హెయిర్‌కట్ సర్వీసును అందిస్తుంది అని రాధాకృష్ణ తెలిపారు.
ఇదిలావుంటే.. ఏపీలో అధికార వైఎస్‌ఆర్‌సీపీ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రతిపక్షంతో తలపడనుంది.