బోట్లు తగలబడడం వెనకుంది ఎవరు.?

వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 42 బోట్లు దగ్ధమయ్యాయి.

By Medi Samrat  Published on  22 Nov 2023 4:29 PM IST
బోట్లు తగలబడడం వెనకుంది ఎవరు.?

వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 42 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (హార్బర్), జాయింట్ డైరెక్టర్ (ఫిషరీస్), జిల్లా అటవీ అధికారి, రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్ఎస్డీఎల్) అసిస్టెంట్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సమయంలో ఓ బృందం పార్టీలో పాల్గొనడంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో ప్ర‌మేయ‌ముంద‌ని లోక‌ల్ బాయ్ నాని అనే యూట్యూబ‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను విచారిస్తున్నామని, త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డీసీపీ (క్రైమ్) జి.నాగన్న తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా సమగ్ర నివేదిక కోరారు.

పడవ యజమానులకు జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం పరిహారం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బోట్లలో ఎల్పీజీ సిలిండర్లు, డీజిల్ ట్యాంకులు ఉండటంతో మంటలు ఒక బోటు నుంచి మరో బోటుకు వేగంగా వ్యాపించి దాదాపు 42 పడవలు కాలిపోయాయి. కోట్లలో భారీ నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు, మత్స్యకారులపై దాని ప్రభావం, నష్ట అంచనా తదితర అంశాలపై సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ (సీఐఎఫ్నెట్) అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story