వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రశ్నించాల్సిన వ్యక్తులను, కస్టడీకి గల కారణాలను సీబీఐ పేర్కొంటేనే కస్టడీ విచారణను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.
సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తూ.. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టును ఆశ్రయించినప్పటికీ, తదుపరి విచారణ కోరుతూ పిటిషన్‌లో లేవనెత్తిన కీలక అంశాలేవీ సరిగా పరిగణించలేదని వాదించారు.
ట్రయల్ కోర్టు ప్రత్యేకంగా అభ్యర్ధించిన కారణాలను పరిశీలించే బదులు, పిటిషన్‌లో లేవనెత్తని అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణకు పరిమితమైన, పాక్షిక అనుమతిని మాత్రమే మంజూరు చేసిందని ఆయన వాదించారు. ఈ క్రమంలో 'పాక్షిక' తదుపరి దర్యాప్తును అనుమతించాలనే ఆలోచనను ప్రశ్నిస్తూ కోర్టు జోక్యం చేసుకోవాలని లూథ్రా కోరారు.
సీబీఐ నుంచి స్పష్టత కోరిన సుప్రీంకోర్టు
వాదనల సమయంలో జస్టిస్ సుందరేష్ జోక్యం చేసుకుంటూ.. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని అభిప్రాయపడుతున్నారా అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను అడిగారు. అదనపు దర్యాప్తు కోరే నిర్దిష్ట అంశాలను స్పష్టంగా వివరించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. విచారణ కోసం ఎవరిని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నారో సీబీఐ సూచించగలిగితే, అభ్యర్థనను ధర్మాసనం సక్రమంగా పరిశీలిస్తుందని కోర్టు పేర్కొంది.
రెండు వారాలు సమయం కోరిన సీబీఐ..
కోర్టు ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ సీబీఐ తరఫు న్యాయవాది.. ఎవరినైనా ప్రశ్నించే విషయం నిర్ధారించడానికి సీబీఐ దర్యాప్తు అధికారిని సంప్రదించవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కసరత్తు కోసం రెండు వారాల సమయం కోరుతూ.. సీబీఐ వాయిదాను అభ్యర్థించింది.