చంద్రబాబుపై పోటీ.. క్లారిటీ ఇచ్చిన విశాల్
Vishal Respond On Rumours. 2024 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత
By Medi Samrat Published on 1 July 2022 7:32 PM IST2024 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్యర్థిగా నటుడు విశాల్ పోటీ చేయబోతున్నారంటూ గడచిన కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఖండిస్తూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. తాజాగా విశాల్ కూడా ఈ వార్తలపై స్పందించాడు. ఏపీ రాజకీయాల్లోకి తాను వస్తున్నట్లు, కుప్పంలో చంద్రబాబుపై పోటీకి దిగుతున్నట్టు వినిపిస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని విశాల్ ప్రకటించాడు. ఈ వ్యవహారం గురించి తనకు అసలే తెలియదని, తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపాడు. తన దృష్టి మొత్తం సినిమాలపై ఉందని.. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశమే తనకు లేదని తెలిపాడు.
ఒకరోజు ముందు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. '2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 175 సాధిస్తుంది. కుప్పంలో పోటీపై ఎల్లో మీడియా.. తమిళ యాక్టర్‌తో మంతనాలు అని వార్తలు రాసింది. 2024లో కుప్పం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భరత్ మాత్రమే. గతంలో పలమనేరులో మేము గెలిపించిన వ్యక్తి.. వేరే పార్టీకి పోయి మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వెంకటే గౌడను మరింత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా' అని అన్నారు.