యూటీఎఫ్ ఇచ్చిన చలో సీఎంఓ పిలుపుకు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణా తెలిపారు. సోమవారం జరిగే సీఎంఓ కార్యక్రమంలో ఉద్యోగులెవరూ పాల్గొనకూడదన్నారు. ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. విజయవాడలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని, 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందని సీపీ తెలిపారు. సీపీఎస్ రద్దు చేయాలని, సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చలో సీఎంఓకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా చలో సీఎంఓ కార్యక్రమాన్ని చేపడతామని యూటీఎఫ్ నేతలు చెబుతున్నట్లు సమాచారం. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని యూటీఎఫ్ నేతలు గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉందని, అయితే ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎస్‌ను రద్దు చేశారని ఆరోపించారు. ఎన్నికల హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.