వినోద్ ​జైన్ రెండు నెలలుగా బాలికను వేధించాడు : ఏసీపీ

Vijayawada ACP Hanumantha Rao On Girl Suicide Case. విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో కలకలంగా మారింది

By Medi Samrat  Published on  30 Jan 2022 11:33 AM GMT
వినోద్ ​జైన్ రెండు నెలలుగా బాలికను వేధించాడు : ఏసీపీ

విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో కలకలంగా మారింది. 9వ తరగతి చదువుతున్న బాలిక శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్​ నోట్​లో పేర్కొందని స్థానిక ఏసీపీ హనుమంతరావు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. వినోద్‌ జైన్ పై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్​ల కింద కేసులను నమోదు చేసినట్టు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. బాలిక లైంగిక వేధింపుల వల్లే చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. గత 2 నెలలుగా బాలికను వినోద్​జైన్ లైంగికంగా​ వేధించాడని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. నిందితుడు వినోద్​జైన్ ఎలాంటి ఇబ్బందులకు గురిచేసేవాడో బాలిక సూసైడ్​ నోట్​లో రాసిందని ఏసీపీ తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించిందని అన్నారు. రెండు పేజీల్లో బాలిక తన బాధను తెలియజేసిందని ఏసీపీ హనుమంతరావు తెలిపారు.


Next Story