ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలపై సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైల్వేజోన్ అంశంపై చర్చ జరగలేదన్నారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్‌ను కేంద్రం నిరాకరిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని ఆరోపించారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని విజయసాయి తెలిపారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియాపై ధ్వజమెత్తారు. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం ద్వారా వారి స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు. కొవ్వూరు-భద్రాచలం మధ్య రైల్వే లైన్ ఏర్పాటుపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు విజయసాయి వెల్లడించారు. "ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదన ఉన్నందున మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది" అని ఆయన వివరించారు.