వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "రాష్ట్రంలో ఈ మధ్య నలబై రోజులుగా జరుగుతున్న నేరాలు, ఘోరాలకు కూటమి ప్రభుత్వం లో పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు, వీటిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యొచ్చు కదా!" అంటూ ట్వీట్ వేశారు. ఏపీలో విద్యారంగం దారి తప్పిందంటూ విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి. "విద్యారంగం దారి తప్పిందని.. పాలకులు మాట తప్పుతున్నారు. స్కాలర్ షిప్ లు రాలేదు, హాస్టల్స్ లేవు, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి, విద్యా రంగం పై తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు, ముందు దాని మీద దృష్టి పెట్టండి" అంటూ హితవు పలికారు.
"అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు, సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? మీరు రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ దాని దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన!" అంటూ నారా లోకేష్ ను ట్యాగ్ చేశారు విజయసాయి రెడ్డి.