31న వైద్య కళాశాలకు వర్చ్యువల్‌గా సీఎం శంకుస్థాపన
Vijayanagaram Medical College. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలకు సీఎం వైఎస్ జగన్ మే 31న
By Medi Samrat Published on 29 May 2021 2:23 PM GMTజిల్లాకు మంజూరైన వైద్య కళాశాలకు సీఎం వైఎస్ జగన్ మే 31న ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్‌గా శంకుస్థాపన చేయనున్నారని విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ వెల్లడించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని గాజులరేగ వద్ద వైద్య కళాశాల ఏర్పాటుకోసం కేటాయించిన 70 ఎకరాల స్థలంలో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు.
రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటవుతోందని, కళాశాల భవనాల నిర్మాణం పనులు నిర్వహించేందుకు నిర్మాణసంస్థను కూడా ఖరారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వైద్య కళాశాల శంకుస్థాపన పనులపై జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్‌తో కలసి శనివారం వైద్య కళాశాల శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. 150 మంది ప్రాంగణంలో కూర్చొని వీక్షించేలా మూడు ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్‌పంపిణీ సంస్థ అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు వీలుగా ఫైబర్‌నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. శంకుస్థాపన శిలాఫలకం, వేదిక బ్యాక్ డ్రాప్ వంటి ఏర్పాట్లను ఏపి వైద్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వైద్య పరమైన సౌకర్యాలు తక్కువగా వున్నందున ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా విశాఖలోని కె.జి.హెచ్.కు వైద్యం కోసం వెళ్లే పరిస్థితి వుండేదని, జిల్లాలోనే ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా జిల్లాలో పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.