విజయనగరం జిల్లాలో జాయింట్ కలెక్టర్ సి.హెచ్ కిషోర్ కుమార్ చేసిన పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) తీరు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఉన్న ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి జాయింట్ కలెక్టర్ సి.హెచ్ కిషోర్ వెళ్లారు. అప్పటికే అక్కడ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కోలహాలంగా ఉంది. ఇదే సమయంలో జాయింట్ మంత్రి బొత్స దంపతులను పుష్పగుచ్ఛం ఇచ్చి.. వారికి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
ఆ తర్వాత కిందకు వంగి మంత్రి బొత్స దంపతులకు జాయింట్ కలెక్టర్ దండం పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒక ఐఏఎస్ (ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీస్) అధికారి మంత్రికి, అతని సతీమణి కాళ్లకు దండం పెట్టడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కలెక్టర్ చేసిన చర్య.. కింది స్థాయి ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే తప్పేముందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఇటువంటి కలెక్టర్ సిగ్గుచేటని అంటున్నారు.