ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, అవసరమైతే పార్టీ పెట్టేందుకు కూడా వెనకడుగు వేయనని మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, తన విషయం ఆయన్ను ఆ కోటరీనే డైవర్ట్ చేస్తోందన్నారు. నిబద్ధత లేని వారి మాటల్ని జగన్ నమ్మొద్దని సూచించారు. ఇప్పటి వరకూ తనకు ఏ రాజకీయ పార్టీ నుంచీ పిలుపు రాలేదని స్పష్టం చేశారు. కానీ తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని, వాటికి ఏమాత్రం తలొగ్గలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తానొక రైతును మాత్రమేనని, దీనిపై ఎవరెన్ని సెటైర్లు వేసినా పట్టించుకోనన్నారు. రాష్ట్రంలో పొట్టిశ్రీరాములు, అన్నమయ్య, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ పేర్లతో జిల్లాలు ఉన్నాయి కానీ.. సైరా నరసింహారెడ్డి పేరుతో జిల్లా లేదన్నారు. కాబట్టి కర్నూల్ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సైరా నరసింహారెడ్డిని గౌరవించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని కట్టేందుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని వెల్లడించారు.