ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రిగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజినీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపారని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. నాడు-నేడు పనుల ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆమె తెలిపారు. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, బీసీలు ఎప్పుడూ సీఎం జగన్ వెంటే ఉంటారని యువ మంత్రి అన్నారు.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన విడదల రజిని విద్యాభ్యాసం కొనసాగించి.. చిలకలూరిపేటకు చెందిన కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రాసెస్ వీవర్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఆమె.. 2018లో వైఎస్సార్‌సీపీలో చేరి 2019లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.