ఆనందయ్య మందు విషయం ఏకంగా ఉప రాష్ట్రపతి వ‌ర‌కూ..

Vice President About Anandaiah Medicine. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు

By Medi Samrat  Published on  21 May 2021 2:32 PM GMT
ఆనందయ్య మందు విషయం ఏకంగా ఉప రాష్ట్రపతి వ‌ర‌కూ..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచనలు చేశారు. కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్ లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు.

ఆనందయ్య ఇస్తున్న క‌రోనా మందుకు విప‌రీత‌మైన డిమాండ్ పెరిగిపోయింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. ఆనంద‌య్య మందుకోసం క‌రోనా రోగులు కూడా వెళ్ల‌డం క‌ల‌వ‌ర‌పరిచింది. నెల్లూరు GGHలో క‌రోనాకు చికిత్స పొందుతున్న రోగులంతా ఉన్న‌ట్టుండి ప‌రారయ్యారని కథనాలు వచ్చాయి. ఆనంద‌య్య ఆయుర్వేద మందు క‌రోనాను న‌యం చేస్తోంద‌ని తెలియ‌డంతో అంద‌రికంద‌రు కృష్ణపట్నం వెళ్లడంతో హాస్పిటల్ మొత్తం ఖాళీ అయ్యింది.

నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు.

ఆనందయ్య రోజుకు మూడు వేల మందికి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తూ ఉండగా.. ఏకంగా 30-50వేల మంది అక్కడికి చేరుకున్నారు. కృష్ణ పట్నంకు వెళ్లే దారులన్నీ రద్దీగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమీక్ష సమావేశంలోనూ చర్చించారు. దీనికి అనుమతి ఇచ్చే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. ముందుగా ఆ ఔషధం శాస్త్రీయతను నిర్ధారణ చేయించాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.


Next Story