బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది
Vasireddy Padma Reacts On Girl Suicide. విజయవాడలోని భవానీపురంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గౌరీ దీక్షిత అనే బాలిక
By Medi Samrat Published on 30 Jan 2022 4:31 PM IST
విజయవాడలోని భవానీపురంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాలిక తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు ఆ రాజకీయ నాయకుడే కారణమని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఐదో అంతస్తు నుంచి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక.. సీసీటీవీ ఫుటేజీ హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు బాలిక 20 నిమిషాల పాటు టెర్రస్‌పై తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వినోద్ జైన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'ఈ ఘటన జరగడం దురదృష్టకరం. బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని.. నిందితులకు శిక్ష పడుతుందని ఆమె అన్నారు.
బాలిక మృతదేహాన్ని చూసి తలిదండ్రులను ఓదార్చారు మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. 14 సంవత్సరాల పాప లైంగిక వేధింపులకు గురైంది. మేడ మీద నుండి దూకే ముందు అటు ఇటు తిరగింది. మరణం తప్ప గత్యంతరం లేదని దూకి ఆత్మహత్య చేసుకుంది. వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడలో అందరికీ తెలుసు. టీడీపీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేసాడు. ఇవాళ కొత్తగా గుర్తొచ్చినట్టు అతన్ని టీడీపీ బహిష్కరించింది. ఒంటరిగా ఉన్న సమయంలో వేధించడంతో బాలిక భయపడిందని వాసిరెడ్డి పద్మ అన్నారు.
కంప్లైంట్ చేసినా వినోద్ రాజకీయ ప్రాబల్యం వల్ల న్యాయం జరగదేమో అని ఆత్మహత్య చేసుకుందని ఆమె అన్నారు. సమాజనికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఇచ్చి బాలిక చనిపోయిందని ఆమె అన్నారు. చాలామంది దొంగల మధ్యలో వినోద్ ఒక దొరికిన దొంగ అని.. ఆరునెలలకు ఒకసారి వచ్చి టీడీపీ నాయకురాలు అనిత అరుస్తుందని విమర్శించారు. మీ బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబు లతో క్షమాపణ చెప్పి బయటకు రావాలని అన్నారు. టీడీపీకి నాయకుల మీద కంట్రోల్ లేదని.. సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందారని అన్నారు. వినోద్‌ను తీవ్రంగా శిక్షించాలని.. గౌరీ దీక్షిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.