లక్ష్మీపార్వతిపై వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు
Vangalapudi Anitha Fires On Lakshmi Parvathi. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన వారిపై నోరు మెదపకుండా.. చంద్రబాబు నాయుడిపై
By Medi Samrat Published on 20 Nov 2021 7:10 PM ISTఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అవమానించిన వారిపై నోరు మెదపకుండా.. చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం వైసీపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత విమర్శించారు. వైసీపీ నేతల అరాచకం, వికృత చేష్టల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు చేసిన ప్రయత్నం నభూతో నభవిష్యత్ అన్నట్లుందని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబంపై అంత ప్రేమ ఉంటే.. ఆ మహానుభావుడి కుమార్తె గురించి అసెంబ్లీ సాక్షిగా తప్పుడు మాటలు మాట్లాడిన వారిని వారించకుండా.. వెనకేసుకుని రావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలోని వ్యక్తిపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే.. వారి వ్యాఖ్యలను సమర్ధించేందుకు మీడియా ముందుకొచ్చి ప్రయత్నించడం, చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి విమర్శలు చేశారు.
వైసీపీ నేతలు ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదని, అంటే బాధపడతానంటున్నారే తప్ప.. కనీసం ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు.. ఇదేనా ఎన్టీఆర్ కుటుంబంపై నీకున్న ప్రేమ.? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చినపుడు నోరెత్తలేదు.. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినపుడు నోరెత్తలేదు.. కుమార్తె అంటున్న భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు వికృత వ్యాఖ్యలు చేస్తుంటే.. వికృత నవ్వులు నవ్విన జగన్ రెడ్డి నీకు కనిపించలేదా.? అని ప్రశ్నించారు.
వికృత రాజకీయాలు చేస్తూ, మహిళల్ని కించపరిస్తే వికటాట్టహాసం చేసిన జగన్ రెడ్డి విసిరే బిస్కెట్లకు కక్కుర్తిపడి చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు మీడియా ముందుకు రావడానికి సిగ్గుగా లేదా.? ఎన్టీఆర్ గారి సిద్ధాంతం కోసమే బతికి ఉన్నానని చెప్పిన లక్ష్మీపార్వతి.. తెలుగు జాతికి అన్యాయం చేస్తున్న, తెలుగు ప్రజలను హింసిస్తున్న వైసీపీలో చేరడం చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని గుర్తుంచుకోండని అన్నారు.
తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయం చేసిన వారికి, బాబాయి శవాన్ని వాడుకుని రాజకీయం చేసిన వారికి, వేల కోట్ల ప్రజా సంపదను బొక్కేసిన వారికి, అధికారం కోసం తల్లీ చెల్లిని రోడ్డున తిప్పి, అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రానికి తరిమేసిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా లక్ష్మీ పార్వతీ.? జగన్ రెడ్డి ఆడుతున్న వికృత రాజకీయ క్రీడలో పావుగా నిలిచి.. చంద్రబాబుపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని తీవ్రవిమర్శలు చేశారు.