రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది.
By Medi Samrat
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా ప్రశ్నోత్తరాల అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వల్లభనేని వంశీని తరలించారు. సత్యవర్ధన్ అనే వ్యక్తికి సంబంధించిన కిడ్నాప్, బెదిరింపులపై అధికారులు వివరణ కోరగా వంశీ సంతృప్తికరమైన సమాధానాలు అందించడంలో విఫలమయ్యాడని అధికారులు తెలిపారు.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యవర్ధన్ కిడ్నాప్‌కు ఎవరు సహకరించారు, హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు అతనిని ఎవరు తరలించారనే వివరాల గురించి వంశీ నుండి మరింత సమాచారం రాబట్టడానికి సాంకేతిక ఆధారాలను కూడా అధికారులు చూపించారు. కోర్టు అధికారికంగా వంశీ రిమాండ్‌ను మార్చి 11 వరకు పొడిగించింది, విచారణకు సంబంధించి వంశీని, మరో ఇద్దరు అనుమానితులను అదనంగా మూడు రోజుల పాటు ప్రశ్నించడానికి పోలీసులను అనుమతించింది. కేసును ఉపసంహరించుకునేలా సత్యవర్థన్‌పై ఎందుకు ఒత్తిడి తెచ్చారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వంశీ అందులో తన ప్రమేయం ఏమీ లేదని తెలిపారు. తనంతట తానే కోర్టుకు హాజరై సత్య వర్ధన్ వాంగ్మూలం ఇచ్చారన్నారు.