తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరవనున్నారు. తొలుత 1.30AMకు VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. తెల్లవారుజామున 5.30కు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతిస్తారు. జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మందికి దర్శనం కల్పించేలా TTD ఏర్పాట్లు చేసింది.
మొదటి మూడు రోజులకు ఆన్‌లైన్‌లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్ల కేటాయింపు పూర్తయింది. మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిగా శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుంచి జనవరి 7వ తేది వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే SSD టోకెన్ల జారీని రద్దు చేయనున్నట్టుగా టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.