దేశ సగటును మించి టీకాలు వేసిన ఘనత మనదే
vaccinated above the national average. వ్యాక్సినేషన్ లో దేశ సగటును మించి టీకాలు వేసిన ఘనత మనదేనని వైద్య ఆరోగ్య శాఖ
By Medi Samrat Published on 2 Jun 2021 1:25 PM GMTవిజయవాడ : వ్యాక్సినేషన్ లో దేశ సగటును మించి టీకాలు వేసిన ఘనత మనదేనని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ ఓ ప్రకటన లో తెలిపారు. కోవిడ్ వ్యాప్తి, నివారణలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కోటి మందికిపైగా మొదటి, రెండో డోసు టీకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించిందనీ, దీంతో రాష్ట్ర జనాభాలో దాదాపు 20శాతం మందికి టీకాలు అందించిన రాష్ట్రంగా నిలవడమే కాకుండా.. వ్యాక్సినేషన్లో దేశ సగటును మించి టీకాలు అందించిన ఘనతను సాధించామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో జూన్ 1వ తేదీ వరకు మొదటి, రెండు డోసుల టీకాలు 1,01,68,254 మందికి వేయడం జరిగింది. ఇందులో మొదటి డోసు టీకా వేసుకున్నవారు 76,28,130 మంది, రెండు డోసులూ తీసుకున్నవారు 25,40,124 మంది ఉన్నారు. అన్ని రాష్ట్రాలకూ కలిపి సుమారు 23 కోట్ల డోసుల్ని కేంద్రం ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మన రాష్ట్రానికి 98,85,650 డోసులు వచ్చాయి. కేంద్రం అన్ని రాష్ట్రాలకూ కేటాయించిన టీకాల్లో మన రాష్ట్రం వాటా సుమారు 4.21 శాతంగా ఉంది. కేంద్రం కేటాయించిన టీకాల్లో మన రాష్ట్రం వాటా సుమారు 4.21శాతంగా ఉంటే.. అదే మహారాష్ట్రలో (9.72శాతం), ఉత్తరప్రదేశ్ (8.99శాతం), రాజస్థాన్ (8.03శాతం), గుజరాత్ (7.63) అధికంగా ఇచ్చారు. మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ (2.82శాతం), తమిళనాడు (4.06), కర్ణాటక (5.98శాతం), కేరళ (4.24శాతం) టీకాలు కేటాయించిందని ఆయన వివరించారు
ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 6 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం
దాదాపు 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్‌ఎంలు, వేలల్లో వైద్యులతోపాటు రెండు లక్షల మందికి పైగా గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో ఒక్క రోజులోనే 6 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అంతేకాకుండా కోవిడ్ డోసులను మన హెల్త్ కేర్ వర్కర్లు ఎక్కడా వృధా చేయకుండా టీకాలు వేయడంతో రాష్ట్రానికి కేటాయించిన డోసుల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందేలా చేయగలిగాం. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇదివరకు రాష్ట్రానికి కేవలం మన వాటా కింద కేటాయించే 11 లక్షల డోసుల నుంచి 13లక్షలకు పెంచిందని కాటంనేని భాస్కర్ తెలిపారు.