ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి గాయమైంది. కారు ఎక్కుతుండగా కిషన్‌రెడ్డి తలకు డోర్ తగలడంతో గాయం తగిలింది. విజయవాడలో గురువారం జరిగిన జన ఆశీర్వాద సభ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రథమ చికిత్స అనంతరం కిషన్‌రెడ్డి తెలంగాణకు బయల్దేరినట్లు తెలుస్తోంది. ఉదయం కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది.
అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని.. నిన్న తిరుపతి వెంకన్నను, ఇవాళ దుర్గమ్మను దర్సించుకున్నానని తెలిపారు. రెండేళ్లుగా కోవిడ్‌తో టూరిజం దెబ్బతిందని.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సీఎస్‌ఆర్ ఫండ్ కింద అభివృద్ధి చేస్తామని అన్నారు. వరంగల్‌లోని వీరభద్ర ఆలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్‌గా గుర్తించిందని.. రానున్న రోజుల్లో ఏపీ పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇదిలావుంటే.. తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర ప్రారంభం కానుంది. కోదాడ బహిరంగ సభలో సాయంత్రం కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు.