ఏపీ సీఎం జగన్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు
Union Minister Dharmendra Pradhan Praised AP CM YS Jagan. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు
By Medi Samrat Published on 30 May 2021 4:34 PM ISTకేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. విశాఖలో ఆర్ఎన్ఐఎల్ ఆధ్వర్యంలో 1000 పడకల కొవిడ్ చికిత్స కేంద్రం నిర్మాణం జరగ్గా.. ఆసుపత్రి ప్రారంభోత్సవం నేడు జరిగింది. వర్చువల్ గా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన జగన్‌పై ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ కూడా ప్రధాని మోదీ తరహాలోనే ఓ లక్ష్యం ఉన్న లక్షణమైన నాయకుడని పొగిడారు.
రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని తగ్గించడంలో జగన్ ప్రభుత్వం సమర్థవంతంగా కృషి చేస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని తగ్గిస్తే.. దేశంలోనూ కరోనాను కట్టడి చేసినట్టేనని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మెగా మెడికల్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. వైద్య, ఆరోగ్య సౌకర్యాల కల్పనలో ఏపీ అగ్రగామిగా ఉందని, మంచి నిర్ణయాలు, మంచి కార్యక్రమాలకు ఏపీ అన్ని వేళలా కేంద్రానికి అండగా నిలుస్తోందని కొనియాడారు. అన్ని రంగాల్లో ముందంజ వేస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే రెండేళ్ల పాలనను పూర్తి చేసుకోగలిగామన్నారు.