కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకున్నారు. కేంద్రమంత్రికి దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న అనురాగ్ ఠాగూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనురాగ్ ఠాగూర్ తో పాటు సోము వీర్రాజు, సునీల్ దేవధర్, విష్ణు వర్ధన్ రెడ్డి, గోకరాజు గంగరాజు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి ప్రభుత్వం రావాల్సి ఉందని అన్నారు. గతంలో టీడీపీ, ప్రస్తుత వైసీపీ పాలన ప్రజలను బాధిస్తున్నాయన్నారు. జవాబూదారీ ప్రభుత్వం.. ప్రజా రంజక పాలన అందించే ప్రభుత్వం త్వరలోనే వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ సుపరిపాలన ఏపీలో మొదలు కాబోతోందని.. ఏపీలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన రాబోయే బీజేపీ ప్రభుత్వం అందిస్తుందని జోష్యం చెప్పారు.