ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై ఇటీవలి కాలంలో నిరసనలు తీవ్రతరమయ్యాయి. ఏపీలో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. గత కొన్నిరోజులుగా నిరుద్యోగులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సోమవారం నాడు విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలువురు నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు, నిరసనలకు తమ మద్దతు ఉంటుందని మావోయిస్టులు కూడా ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు విశాఖ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరిట ఓ ఆడియో విడుదలైంది. ఈ ఆడియోలో అరుణ మాట్లాడుతూ, ప్రభుత్వం మోసపూరిత విధానాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలపై ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. వేల సంఖ్యలో పాఠశాలలు మూతపడ్డాయని, వేలాదిమంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొత్తగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి.


సామ్రాట్

Next Story