అమరావతి: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27, 28, 29 తేదీల్లో హాలిడే ఇచ్చారు. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27, 28న సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. కాగా మరికొన్ని జిల్లాల్లోనూ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో దాదాపు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, నిన్న, 25 అక్టోబర్ 2025న 11.30 గంటలకు IST వద్ద కేంద్రీకృతమై ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. తుపాను నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడనున్నందున నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు బుధవారం వరకు నిలిపివేయాలని,అలాగే బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం కుడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. జిల్లాలకు తుపాను ఎస్వోపి అమలుపై సూచనలు జారీ చేశారు.
నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిబారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.