ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో వారిరువురు ఐసోలేషన్ లోకి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నిరోజుల వ్యవధిలో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ కోసం పలువురు విరాళాలు ఇస్తూ ఉన్నారు. వైసీపీ ఎంపీ బాలశౌరి ఏపీలో కొవిడ్ వ్యాక్సిన్ల ఉచిత పంపిణీ కోసం రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. కరోనా టీకా డోసులను ప్రజలకు ఉచితంగా అందించాలన్న సీఎం జగన్ నిర్ణయానికి తనవంతు మద్దతుగా విరాళం ప్రకటించినట్టు బాలశౌరి పేర్కొన్నారు. పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ నుంచి లక్ష కరోనా వ్యాక్సిన్లు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. ఇవన్నీ కొవిషీల్డ్ టీకా డోసులు. వీటిని గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజి కేంద్రానికి తరలించారు.
ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖర్చుతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది.